నన్ను చూసి నవ్వడం కాదు…..అందరం నవ్వుకున్నాం: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్న వారంతా కూడా నవ్వారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల పై ట్రంప్ స్పందించారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి సభ్యులు నవ్వారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాళ్లు ఓ సందర్భంలో సరదాగా నాతో పాటు కలిసి నవ్వారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఐరాస సమావేశంలో అమెరికా గత రెండేళ్లలో సాధించిన పురోగతి గురించి ట్రంప్ మాట్లాడుతుండగా సభ్యులు నవ్వారని ట్రంప్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని నిన్న వార్తలు రావడం తో ట్రంప్ ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తనను చూసి ఎవ్వరూ నవ్వలేదని,తనతో పాటు కలిసి నవ్వారని తెలిపారు. ‘మేము సరదాగా ఉన్నాం. అది నన్నుచూసి నవ్వడం కాదు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ను చూసి నవ్వారని నకిలీ వార్తలు వచ్చాయి. సభలో మేము చక్కని సమయం గడిపాం. కలిసి నవ్వాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.