యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాక్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాక్ తీరుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.‌ ఈ సందర్భంగా ఇస్లామిక్‌ సహకార సమాఖ్య (ఓఐసీ) నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ కాశ్మీర్‌ విషయాన్ని లేవనెత్తింది. దీంతో భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా అసమంజసమైన చర్య అని పేర్కొంది. అలాగే, భారత అంతర్గత వ్యవహారం గురించి ఓఐసీలోని దేశాల సభ్యులు చర్చించడాన్ని కూడా ఖండించింది. ఈ విషయంపై ఈ రోజు విదేశాంగ శాఖ అధికారి రవీశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘భారత అంతర్గత విషయం గురించి ఓఐసీలో మళ్లీ చర్చించారు. మేము ఈ తీరుని ఎప్పటికీ ఒప్పుకోం’ అని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఈ విధంగా కాశ్మీర్ సమస్య పై చర్చించడం ఇది తొలిసారి ఏమీ కాదు. గతంలో కూడా పలు సార్లు ఇదే అంశం పై పాక్ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారత అంతర్గత వ్యవహారంపై మాట్లాడే అధికారం ఎవరికీ లేదని మేము గతంలోనూ ఓఐసీకి చెప్పాం. ఈ విషయాన్ని లేవనెత్తాలనుకుంటున్న పాకిస్థాన్.. తమకు సానుకూలంగా ఉండే విషయాన్నే వివరిస్తుంది. వారు చెప్పే అసత్యాలను ఇప్పటికే అంతర్జాతీయ సమాజం కొట్టిపారేసింది’ అని రవీశ్‌ కుమార్‌ గుర్తు చేశారు.