ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిని నిలిపివేయనున్న భారత్!

వాస్తవం ప్రతినిధి: వచ్చే నెలలో ఇరాన్‌ నుండి ముడి చమురు దిగుమతిని తగ్గించాలి లేదా పూర్తిగా నిలిపివేయాలని భారత ఆయిల్‌ కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మధ్య ప్రాచ్య సరఫరా దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్‌ నుండి దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు మూడీ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంస్థ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలు నవంబర్‌ 5 నుండి అమల్లోకి వస్తాయని, ఇరాన్‌ చమురు దిగుమతిని తగ్గించుకునే దేశాలతో యుఎస్‌ పనిచేస్తుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  చైనా తర్వాత భారత్‌ ఎక్కువగా ఇరాన్‌ నుండి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌- ఆగష్టు వరకు పర్షియన్‌ గల్ఫ్‌ దేశాల నుండి 30 శాతం ముడి చమురు ఎగుమతి అయ్యింది. భారతీయ ఆయిల్‌ పరిశ్రమలు 80పైగా విదేశాల నుండి తమ ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇరాన్‌ నుండి 14 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.