ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు బంగ్లా ఆల్ రౌండర్ దూరం  

వాస్తవం ప్రతినిధి: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్ ఫైనల్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలుస్తుంది. చేతి వేలి గాయం కావడం తో వైద్యుల సలహా మేరకు హాసన్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. దీనితో షకీబ్ ఆసియాకప్‌ నుంచి నిష్క్రమించాడు. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ అక్రమ్‌ ఖాన్‌ మాట్లాడుతూ…‘ అల్‌ హసన్‌ కొంత కాలంగా చేతివేలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గాయంతోనే ఇన్ని రోజులు మ్యాచ్‌లు ఆడాడు. వైద్యుల సలహా మేరకు అతడికి విశ్రాంతి ఇచ్చాం. మరో నాలుగైదు వారాల పాటు అతడు అందుబాటులో ఉండడు. మొదటి నాలుగు మ్యాచ్‌లు స్వదేశం కోసం ఆడిన అతడికి ధన్యవాదాలు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు‌ 14 వరకు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌ల్లోనూ అతడు పాల్గొనడు’అని తెలిపారు.

ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా బుధవారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌-పాకిస్థాన్‌ తలపడిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే ఫైనల్‌లో భారత్‌-బంగ్లా తలపడనున్నాయి.