సెరెనా పై గుర్రుమంటున్న అంపైర్లు

వాస్తవం ప్రతినిధి: అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ తార, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ సెరెనా విలియమ్స్‌ ఆడే మ్యాచ్‌లకు అంపైర్లగా బాధ్యతలు నిర్వహించేది లేదని అంపైర్లు మరో సారి తేల్చి చెప్పారు. ఆమె సారీ చెప్పేవరకు ఆమె ఆడే మ్యాచ్ లకు అంపైర్స్ గా భాద్యతలు నిర్వహించేది లేదని వారు తేల్చి చెప్పారు. ఇందుకు కారణం ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో చైర్‌ అంపైర్‌పై విరుచుకుపడటమే. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒసాకాతో సెరెనా తలపడింది. రెండో సెట్‌ రెండో గేమ్‌ సందర్భంగా సెరెనాకు ఆమె కోచ్ మౌరాత్‌గ్లో స్టాండ్స్‌ నుంచి సూచనలు చేస్తూ కనిపించాడు. ఇది గమనించిన చైర్‌ అంపైర్‌ రామోస్‌..సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేశాడు. దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక ఒసాకా బ్రేక్‌ సాధించడంతో తీవ్ర అసహనానికి గురైన సెరెనా రాకెట్‌ను నేల కేసి కొట్టింది. దీంతో అది విరిగిపోయింది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అంపైర్‌ సెరెనాకు రెండో హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఓ పాయింట్‌ కోత పెట్టాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన సెరెనా.. గేమ్‌ విరామంలో రామోస్‌ను దొంగ అంటూ విరుచుకుపడింది. అంతేకాదు నా నుంచి పాయింట్‌ దొంగలించావు. ఇక నువ్వు బతికున్నంత కాలం నేనాడే మ్యాచ్‌లకు అంపైర్‌గా ఉండబోవు అని ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనితో సెరెనా వ్యాఖ్యలపై అంపైర్లందరూ గుర్రుగా ఉన్నారు. దీంతో వారు ఇక నుంచి సెరెనా విలియమ్స్‌ ఆడే మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించం అని అంపైర్లంతా తేల్చి చెప్పారు. ఆమె క్షమాపణలు చెప్పే వరకు అంతే అని వారంతా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.