నేను జరిమానా వేయించుకోవాలని అనుకోవడం లేదు: ధోనీ

వాస్తవం ప్రతినిధి:  ‘నేను జరిమానా వేయించుకోవాలని అనుకోవడం లేదు’ అని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అన్నాడు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే, ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్‌కు మహి సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. రసవత్తరంగా జరిగిన ఈ పోరు చివరికి టైగా ముగిసింది. మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ పట్ల అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఛేదనలో ఎంఎస్ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌ను ఫీల్డ్‌ అంపైర్లు గ్రెగరీ బ్రాత్‌వైట్‌ (వెస్టిండీస్‌), అనిసర్‌ రెహ్మాన్‌ (బంగ్లాదేశ్‌) ఎల్బీగా ప్రకటించారు. అయితే టీవీ రిప్లేలో వీరిద్దరూ నాటౌట్‌గా తేలింది. దురదృష్టం కొద్దీ కేదార్‌ జాదవ్‌ రనౌట్‌ అయ్యాడు. మ్యాచ్‌ టై కాగానే ధోనీ మీడియాతో మాట్లాడాడు. ‘కొన్ని రనౌట్లు చోటు చేసుకున్నాయి. కొన్నింటి గురించి మాట్లాడలేం. అవి మాట్లాడి నాపై జరిమానా విధించుకోలేను’ అని మహీ అన్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్ల తప్పిదాల గురించి బహిరంగంగా మాట్లాడటం క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుంది. అలా మాట్లాడిన ఆటగాళ్లపై ఐసీసీ జరిమానా విధిస్తుంది. అందుకే ధోనీ చాలా చాకచక్యంగా అంపైర్ల నిర్ణయాల గురించి మాట్లాడాడు. మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చాలా బాగా ఆడిందని మహీ ప్రశంసించాడు. వారు అన్ని విభాగాల్లోనూ చాలా మెరుగయ్యారని పేర్కొన్నాడు.