రేవంత్ రెడ్డి ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాలపై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు

వాస్తవం ప్రతినిధి: రేవంత్ రెడ్డి ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాదులోని రేవంత్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సోదాలు చేయాల్సింది రేవంత్ ఇంట్లో కాదని… కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్ లో సోదాలు నిర్వహిస్తే… వందల కోట్ల రూపాయలు దొరుకుతాయని చెప్పారు. దేశంలో అత్యంత అవినీతికి పాల్పడింది కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. కాంట్రాక్లర్ల నుంచి కేసీఆర్ కుటుంబం 6 శాతం కమిషన్లను దండుకుందని ఆరోపించారు.కేసీఆర్ బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరని… టీఆర్ఎస్ పై ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పారు,

కేంద్ర సంస్థలతో సోదాలను నిర్వహిస్తూ… తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ, అధికార పార్టీ నేతలు తప్పించుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లు విపక్షాలను అణచివేసే కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.