ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు :చింతమనేని ప్రభాకర్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ స్థాయిని దిగజార్చుకుని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్టుగా నటించినట్టే… దెందులూరు సభలో పది పేపర్లు తిరగేసి చదివారు. మీ పేపర్లలో ఉన్న మ్యాటర్ తో ఏం పొడిచారు?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై 37 కేసులున్నాయని పవన్‌ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు అసత్య ఆరోపణలు చేయడం తప్ప పవన్ చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపితే శాశ్వతంగా రాజకీయాలను వదిలేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.

మీ అన్నగారు చిరంజీవి గురించి ఒక్క మాట కూడా మాట్లాడవని.. ఆయనేదో పెద్ద శ్రీరామ చంద్రుడు అయినట్టు పోజులిస్తున్నావంటూ పవన్ పై ప్రభాకర్ మండిపడ్డారు. తమ సామాజిక వర్గానికి ఏదో చేస్తాడనే ఆశతో కాపు సామాజికవర్గం మీ అన్నకు మద్దతు పలికితే… గంపగుత్తగా పార్టీనంతా తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశారని విమర్శించారు. తనపై విమర్శలు గుప్పించేంత స్థాయి పవన్ ది కాదని… మోదీ లాంటి వ్యక్తులను విమర్శించేంత పెద్ద స్థాయి అతనిదని ప్రభాకర్ చెప్పారు. ఒక ఎమ్మెల్యే స్థాయికి దిగజారి మాట్లాడటం ఒక పార్టీ అధినేతకు తగదని హితవు పలికారు.