యాదగిరి గుట్టలో ‘మోత్కుపల్లి శంఖారావం’

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరొందిన మోత్కుపల్లి టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి. కానీ చేరికలపై ఆయన ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యి జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. టీఆర్ఎస్ లోకి కూడా వెళదామనుకున్నా కేసీఆర్ నుంచి స్పందన లేదట..
ఎట్టకేలకు ఆయన ముందస్తు ఎన్నికల బరిలో నిలువనున్నట్లు ప్రకటించారు, తన సొంత నియోజకవర్గమైన ఆలేరు స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడిన మోత్కుపల్లి నర్సింహులు ‘ఆలేరు ప్రజల అభీష్టం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చి చెప్పారు.

ఈ మేరకు యాదగిరి గుట్టలో ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. సభ ఏర్పాట్లను తన మద్దతుదారులతో కలిసి బుధవారం పరిశీలించారు.