రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ఆకస్మిక దాడులు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో ముందస్తు వేడి ఊపందుకోగా, మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించాయి. కొడంగల్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం నుంచి ముమ్ముర సోదాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న దాడులు, మూడున్నరేళ్లక్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగానేనని తెలుస్తోంది. అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై జరుపుతున్న విచారణలో భాగంగానే దాడులు చేస్తున్నట్టు సమాచారం.
కేసును విచారిస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను కోరగా, రంగంలోకి దిగిన ఈడీ ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. ఏసీబీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై కేసు పెట్టిన ఈడీ, హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది.