27 కేసులున్న ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది?: పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: పశ్చిమగోదావరి జిల్లా జనసేన పోరాటయాత్రలో భాగంగా దెందలూరులో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రౌడీలు చట్టసభలకు వెళ్లి పిచ్చి వాగుళ్లు వాగితే ప్రభుత్వం ఏం చేస్తోందని, తన సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దని అన్నారు. ఏదైనా స్టింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఈ రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చుకదా? ఈ ఆకు రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చు కదా? అంటూ పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని ఉద్దేశించి ప్రశ్నించారు.న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే రౌడీ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటారని 27 కేసులున్న ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ఓ దళిత వ్యక్తిపై దాడి చేస్తే పట్టించుకోలేదని కనీసం కేసు కూడా నమోదు చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యేపై సీఎం చర్యలు తీసుకుంటారా లేక తామే చర్య తీసుకోమంటారా అని ప్రశ్నించారు. తాను రెచ్చగొట్టాలంటే అగ్నిగుండం సృష్టించగలనన్నారు పవన్. అమాయకులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని.. జనం కోసం జన సైనికులు ఉన్నారన్నారు పవన్. జనసేన పార్టీని చాలా ప్రతికూల పరిస్థితుల్లో స్థాపించానని, ప్రస్తుత రాజకీయాలు అవకాశవాదంతో నిండిపోయాయని విమర్శించారు.
19 ఏళ్లకే సాయుధ పోరాటానికి సిద్ధమయ్యానని,ఆకు రౌడీలను, గాలి రౌడీలను 16 ఏళ్ల వయసు నుంచే చూస్తున్నానన్నారు. తాను ప్రభుత్వానికి ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చిందో గతంలోనే చెప్పానని సీఎంను కలిసి బలమైన లా అండర్ ఆర్డర్ కావాలని ఆడపడుచులకు భద్రత కల్పించాలని కోరానని కానీ రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని అన్నారు.