నా బిడ్డకు దేశభక్తి అంటే ఏంటో తెలిసేలా పెంచుతా: వీర జవాన్ భార్య  

వాస్తవం ప్రతినిధి:  ‘నా బిడ్డకు దేశభక్తి అంటే ఏంటో తెలిసేలా పెంచుతా. వాడిని కూడా సైన్యంలోకి పంపుతా’ అని మంగళవారం జమ్ముకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ ముష్కరులు జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన లాన్స్ నాయక్ సందీప్ సింగ్ భార్య గుర్ ప్రీత్ అన్న మాటలు ఇవి. మంగళవారం నియంత్రణ రేఖ వద్ద పాక్ ముష్కరులు,భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో లాన్స్ నాయక్ సందీప్ సింగ్ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఆయన స్వస్థల మైన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త మృతదేహాన్ని చూసి గుర్‌ప్రీత్‌ కన్నీరుమున్నీరైంది. అలాగని ఆమె ధైర్యం కోల్పోలేదు. తన బిడ్డను కూడా ఆర్మీలోకి పంపుతానని అంటోంది. తండ్రి ఇక ఎప్పటికీ రాడని తెలియని ఆ బాలుడు తన తండ్రి భౌతికకాయం వద్ద నిలబడి సెల్యూట్‌ చేస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తే హృదయం ద్రవించకమానదు. తన భర్తను పోగొట్టుకున్నంత మాత్రాన జీవితంలో దేనికీ భయపడనని, దేశం కోసం తన భర్త ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందని గుర్‌ప్రీత్‌ తెలిపారు. తన కుమారుడిని బాగా చదివించి సైన్యంలోకి చేరుస్తానని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన కాల్పుల్లో సందీప్‌ సింగ్‌కు బుల్లెట్లు తగిలినా ఏమాత్రం బెదరకుండా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టి ప్రాణాలను విడిచారు. 2016లో భారత ఆర్మీ పాకిస్థాన్‌లో నిర్వహించిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌లోనూ సందీప్‌ సింగ్‌ పాల్గొన్నారు.