అమెరికా,చైనా ల మధ్య మరో తంటా!

వాస్తవం ప్రతినిధి: ఒకపక్క వాణిజ్య యుద్ధం తో నిత్యం వార్తల్లో నిలుస్తున్న అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు మరో తంటా వచ్చి పడింది. వాణిజ్య తగాదాలు, పోటాపోటీ సుంకాల విధింపులు ఓ పక్క జరుగుతూనే ఉంటుండగా, ఇప్పుడు రాకపోకల వివాదం రాజుకుంటున్నది. అమెరికా పౌరులు, అధికారులు, జర్నలిస్టులు టిబెట్ వెళ్లాలంటే చైనా ప్రభుత్వ అనుమతి పొందడం తప్పనిసరి అయ్యింది. అయితే ఈ అనుమతి సాధారణంగా లభించదు, అలా అనుమతి నిరాకరించిన అధికారులు అమెరికాకు రాకుండా అడ్డుకునే బిల్లును కాంగ్రెస్ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తుంది. అయితే ఈ బిల్లుకు రెసిప్రోకల్ యాక్సెస్ టు టిబెట్ యాక్ట్ అని పేరు పెట్టారు. దౌత్యరంగంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోవాలని, అలా కాదంటే మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా వ్యవహరించాల్సి వస్తుందని భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ బిల్లుపై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసలు ఈ బిల్లును ఎప్పుడో తెచ్చి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. పాలక రిపబ్లికన్లు, విపక్ష డెమొక్రాట్లు కలిసికట్టుగా తెచ్చిన ఈ బిల్లు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత విషమస్థితికి చేరుస్తాయని భావిస్తున్నారు.