పెళ్లి పీటలు ఎక్కనున్న సైనా

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పెళ్లిపీటలెక్కబోతున్నారు. అయితే ఇంతకీ ఆ వరుడు ఎవరో తెలుసా. సహ ఆటగాడు, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌. ఆయన తో సైనా వివాహం జరగనుందని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి పెళ్లికి పచ్చజెండా ఊపారు. కొంత కాలంగా వీరిద్దరి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించి చర్చజరుగుతుండగా ఇప్పుడు వివాహం జరిగే తేదీని కూడా ప్రకటించేసినట్లు వార్తలొస్తున్నాయి.
సైనా సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం సైనా-కశ్యప్‌ జంట డిసెంబర్‌ 16న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి వివాహం నిరాడంబరంగా జరగనుంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరు వివాహబంధంతో ఒక్కటికానున్నారు. అనంతరం ఐదురోజుల తర్వాత అంటే డిసెంబర్‌ 21న వైభవంగా రిసెప్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది.