విజయ్ దేవర కొండ సరసన జాన్వీ కపూర్

వాస్తవం సినిమా: ‘ పెళ్లి చూపులు’  సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకొని,అర్జున్ రెడ్డి వంటి హిట్ మూవీ తో మంచి స్టార్ డం తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ, ఇటీవల గీత గోవిందం చిత్రం తో కూడా ప్రేక్షకులకు అలరించిన విజయ్ సరసన్ అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ నటించనున్నట్లు తెలుస్తుంది. శ్రీదేవి గురించి సినీ ప్రపంచంలో ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేసిన సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా జాన్వి తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే త్వరలో జాన్వి.. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెలుగులో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రంలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసులను దోచుకున్న జాన్విను తమ తదుపరి సినిమాల్లో కథానాయికగా ఎంపికచేసుకోవాలని దర్శకులు ఆశపడుతున్నారు. ఈ విషయం గురించి జాన్వి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వి చేతిలో మరో హిందీ చిత్రం ఉంది. ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రంలో జాన్వి నటించబోతున్నారు.