నాలుగు రోజుల్లో దాదాపు 40 మంది పోలీసులు రాజీనామా

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదుల చర్యలకు భయపడి గత నాలుగు రోజుల్లో కాశ్మీర్ లో దాదాపు 40 మంది పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినటు తెలుస్తుంది. గత శుక్రవారం కశ్మీర్‌ రాష్ట్రంలోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్‌ పోలీసు అధికారులను(ఎస్పీవో) వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులను టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు ‘ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా.. చస్తారా’ అని బెదిరిస్తున్న నేపథ్యంలో 40 మంది ఎస్పీవోలు రాజీనామా చేసినట్లు సమాచారం. పోలీసు అధికారులు రిజైన్‌ చేయడమే కాక ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ రాజీనామా వీడియోలను హోం శాఖ ఖండిచడమే కాక సదరు వీడియోల్లో ఉన్న వారు అసలు ఎస్పీవోలే కాదని ప్రకటించింది. ఒక వేళ వారు నిజంగా పోలీసు అధికారులైనా.. కేవలం 40 మంది రాజీనామాల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని హోం శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది ఎస్పీవోలున్నారని వారితో పోల్చుకుంటే రాజీనామా చేసినవారు చాలా తక్కువ అని పేర్కొన్నారు.