భారత్ తో టై అంటే అది విజయంతో సమానమే: ఆఫ్ఘన్ సారధి

వాస్తవం ప్రతినిధి: ఆసియా కప్‌లో భాగంగా అఫ్గనిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 4 మ్యాచ్‌లో భారత్‌కు వూహించని ఫలితం దక్కింది. దాదాపు విజయం సొంతం అవుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తో జరిగిన మ్యాచ్ టై గా ముగియడం తో ఆఫ్ఘన్ జట్టు కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భారత్‌ లాంటి జట్టుతో మ్యాచ్‌ టై అయినా అది విజయంతో సమానేమనని అఫ్గాన్‌ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గాన్‌ అన్నాడు. ‘పిచ్‌ మాకు ఎంతో సహకరించింది. షేజాద్‌ చాలా బాగా ఆడాడు. ఓపెనింగ్‌ భాగస్వామ్యం కూడా బాగుంది. అలాగే మా స్పిన్నర్లు కూడా రాణించారు. భారత్‌లాంటి జట్టుతో మ్యాచ్‌ టై అయిందంటే.. అది విజయం లాంటిదే. వాళ్లు సులభంగా లక్ష్యాన్ని ఛేదించగలరు .అయినా మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇది అభిమానులను కూడా మంచిదే.’ అని అస్గర్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు సారథ్య బాధ్యతలు వహించిన ధోనీ స్పందిస్తూ.. ‘తప్పు జరిగిందని నేను చెప్పలేను. అయితే మేం చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చాం. టైగా ముగియడం ద్వారా మాకు చెడు ఏమీ జరగలేదు. మ్యాచ్‌ను మేం కోల్పోయి ఉండేవాళ్లం అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా అంతే స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. ఈ రోజు జరిగే సూపర్‌-4 ఆఖరి మ్యాచ్‌లో పాక్‌-బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో భారత్‌ ఫైనల్లో తలపడనుంది.