న్యాయస్థాన వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చిన కోర్టు

వాస్తవం ప్రతినిధి: న్యాయస్థాన వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారానికి, విచారణ వీడియోలకు సుప్రీం కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారాలను చేయాలని డిమాండ్‌ చేస్తూ నేషనల్‌ లా యూనివర్శిటీకి చెందిన విద్యార్థి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై గత నెల 24 న కోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపధ్యంలో ప్రజల హక్కుల సమతల్యతకు అవసరమైన నియమాలు, చట్టాల గౌరవాన్ని కాపాడే అవసరమైన నిబంధనలు త్వరలో రూపొందించబడతాయని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, ఎఎం ఖానిల్కర్‌, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన రెండు అభ్యర్థనలను పరిశీలించిన కోర్టు పై మేరకు తీర్పును వెల్లడించింది. రాజ్యాంగ, జాతీయ ప్రాముఖ్యత విషయాల గురించి పౌరులకు నవీకరించాల్సిన అవసరముందని, రాజ్యాంగపరమైన ముఖ్య విషయాల్లో వీడియో రికార్డింగ్‌ అవసరమని అడ్వకేట్‌ ఇందిరా జైసింగ్‌ కోరిన నేపధ్యంలో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. గతంలో ఈ ప్రతిపాదనకు కేంద్రం సిఫార్సు చేసిన మార్గదర్శకాలను సమర్పించాలని అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ కోర్టు ను కోరగా, ఆయన విచారణ సందర్భంగా కేంద్ర తరుపున కోర్టుకు హాజరైనట్లు తెలుస్తుంది.