ఆధార్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

వాస్తవం ప్రతినిధి: ఆధార్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేత్రుత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలుగా రిజర్వ్‌లో ఉంచిన తీర్పును నేడు వెలువరించింది.
ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లను అనుసంధానం అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి చేస్తూ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఆధార్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆధార్ అనుసంధానం, ఆధార్ చట్టబద్ధతపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరిచింది. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించవచ్చని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏఏ ప్రకారం, ఐటీ రిటర్నుల దాఖలు సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించడం తప్పనిసరని తెలిపింది.

ఇక స్కూల్ అడ్మిషన్ల విషయంలో ఆధార్ పై స్పందిస్తూ, సెక్షన్ 7 కింద స్కూల్ అడ్మిషన్, విద్యార్థికిగానీ, అతని తల్లిదండ్రులకు గానీ దక్కే ప్రయోజనం ఏమీ కాదని, దీనివల్ల ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్ లేదని స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడం నేరమని పేర్కొంది. సీబీఎస్ఈ, నీట్, యూజీసీ తదితరాలు ఆధార్ ను తప్పనిసరి చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది.