ఏలూరులో ఆటో డ్రైవర్ల సంఘాలతో పవన్ కల్యాణ్ భేటీ

వాస్తవం ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకొస్తే ఆటోడ్రైవర్లకు బ్యాటరీ ఆటోలు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని క్రాంతి కల్యాణ మంటపంలో ఆటో డ్రైవర్ల సంఘాలతో పవన్ కల్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ,ఆటో డ్రైవర్ల ఆత్మగౌరవాన్ని జనసేన పార్టీ కాపాడుతుందని చెప్పారు. తాము అధికారంలోకొస్తే, ఆటోడ్రైవర్లకు బ్యాటరీ ఆటోలు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని, ఆ ఆటోలను సబ్సిడీపై ఇచ్చేలా ‘జనసేన’ చూస్తుందని హామీ ఇచ్చారు. పోలీసులు, ట్రాన్స్ పోర్టు అధికారులతో సామరస్యంగా ఉండాలని, అధికారులతో గొడవలు పడొద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. సంబంధిత అధికారుల పైనా ఒత్తిళ్లు ఉంటాయి కనుక, వారిపై కాకుండా వారిని నడుపుతున్న వ్యవస్థపై పోరాటం చేద్దామని పవన్ అన్నారు.