భారత్ అయిష్టంగానే ఉంది….కానీ మేం మాత్రం శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నాం!

వాస్తవం ప్రతినిధి: భారత్‌, పాక్‌ విదేశాంగశాఖ మంత్రుల భేటీ ని భారత్ రద్దు చేసినప్పటి నుంచి కూడా పాక్ వరుసగా ఆరోపణలు గుప్పిస్తూ నే ఉంది. ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా విమర్సలకు దిగగా ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి విమర్శలు చేసారు. భారత్‌ అయిష్టంగానే ఉంటుందని, కానీ మేం మాత్రం శాంతి చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి చెప్పుకొచ్చారు. వాషింగ్టన్‌లోని పాక్‌ ఎంబసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ‘అనవసర కారణాలను చూపించి భారత్‌ మాతో శాంతిపూర్వక చర్చలను ఎందుకు రద్దు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. భారత్‌ అయిష్టంగా ఉన్నప్పటికీ.. శాంతి చర్చలకు మేం ఎప్పుడూ సంసిద్ధమే. సమస్యల నుంచి దూరంగా వెళితే కాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడదు. ఒకసారి చర్చలు అంటారు.. తర్వాత వాటిని రద్దు చేస్తారు. మేం సరైన మార్గం ద్వారానే చర్చలు జరపాలని ఆశిస్తున్నాం. అందుకు వాళ్లు మొదట అంగీకరించారు.. కానీ మళ్లీ నిరాకరించారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. యుద్ధం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మేం కాదు. మేం శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. అయిష్టంగా ఎవరున్నారనేది మీరే గుర్తించండి’ అని ఆయన తెలిపారు. ఉగ్రవాది బుర్హన్‌వనీనికి కీర్తిస్తూ స్టాంపులు విడుదల చేయడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఈ విషయంపై ఆయన స్పందించారు. ‘కశ్మీర్‌ కోసం ఎంతోమంది ప్రజలు పోరాడుతున్నారు.. అంతమాత్రాన వారంతా ఉగ్రవాదులు కాదు’ అని ఆయన వెల్లడించారు.