మాథ్యూస్ పై వేటు

వాస్తవం ప్రతినిధి:  ఆసియా కప్‌ వన్డే టోర్నీలో అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల చేతిలో పరాభవాలతో శ్రీలంక గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌పై వేటు పడినట్లు తెలుస్తుంది. రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనకు మాథ్యూస్‌ను కెప్టెన్‌గా తప్పిస్తూ లంక క్రికెట్‌ బోర్డు తాజాగా  నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాథ్యూస్‌ తనకు తానుగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి లంకకు పదే పదే కెప్టెన్లు మారుతున్నారు. ఆసియా కప్‌కు మళ్లీ మాథ్యూస్‌కు బాధ్యతలు అప్పగించగా.. అతడి సారథ్యంలో లంక పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఏంజెలోపై వేటు వేసి టెస్టు సారథి చండిమాల్‌నే అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్‌ గా భాద్యతలు కట్టబెట్టారు.  ఐతే మరోపక్క ఆసియా కప్‌ వైఫల్యానికి తనొక్కడినే బాధ్యుడిని చేయడం పట్ల మాథ్యూస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘ఆసియా కప్‌ వైఫల్యానికి సంబంధించి బాధ్యతలో నేనూ భాగం తీసుకుంటాను. కానీ జట్టు మొత్తం వైఫల్యానికి నన్ను బలిపశువును చేశారు. అన్ని నిర్ణయాలూ సెలక్టర్లు, కోచ్‌తో కలిసి తీసుకున్నాను. నేను వన్డేలు, టీ20లు ఆడటానికి అనర్హుడినని భావిస్తే రిటైరవడానికి కూడా సిద్ధం. నేను జట్టుకు భారం కావాలని అనుకోవట్లేదు’’ అని మాథ్యూస్‌ పేర్కొన్నాడు.