భారత్ చేతిలో ఓడిపోవడం పై విమర్శలు చేస్తున్న పాక్ అభిమానులు

వాస్తవం ప్రతినిధి: ఆసియా కప్‌లో భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను రెండోసారి చిత్తు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండుసార్లు భారత్ చేతిలో పాక్ ఓటమి పాలవ్వడాన్ని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనితో జట్టు పేలవ ప్రదర్శనపై వారు మండిపడుతున్నారు.  మరీ ముఖ్యంగా సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవాలనే కెప్టెన్‌ నిర్ణయంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ ఈ మ్యాచ్‌ గెలవాలి. లేకపోతే సర్ఫరాజ్‌ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతాయి’ అని మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ పేర్కొన్నాడు. భారత్‌పై రెండోసారి ఓటమి అనంతరం పాక్‌ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్‌ అభిమానులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా విరుచుకుపడుతున్నారు.