నాని ఆ రీమేక్ లో నటిస్తాడా?

వాస్తవం సినిమా: ‘ఆహా కళ్యాణం’ చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన బ్యాండ్ బాజా బారాత్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. అంతకు ముందు ‘భీమిలి కబడ్డి జట్టు’ చిత్రం కూడా రీమేక్ గా చేశాడు. ఈ రెండు రీమేక్ లు కూడా నిరాశ పర్చిన నేపథ్యంలో నాలుగున్నర సంవత్సరాలుగా రీమేక్ లకు పూర్తి దూరంగా ఉంటూ వస్తున్నాడు నాని. మళ్లీ ఇన్నాళ్లకు నాని రీమేక్ రిస్క్ తీసుకునేందుకు సిద్దం అయ్యాడంటూ తాకా సమాచారం. తమిళంలో తెరకెక్కిన ‘96’ చిత్రం రీమేక్ లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి సమాచారం అందుతుంది.

తమిళంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా తెరకెక్కిన ‘96’ చిత్రం అక్కడ భారీ అంచనాలను కలిగి ఉంది. వచ్చే నెల 4న అక్కడ విడుదల కాబోతున్న 96 చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు కొనుగోలు చేశాడు. దిల్ రాజు మొదట ఈ చిత్రాన్ని డబ్ చేసి అదే అక్టోబర్ 4న విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని సినిమా షో చూసిన తర్వాత రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చాడు. ఈ రీమేక్ కు నాని అయితే బాగుంటుందని దిల్ రాజు భావించాడట. దిల్ రాజు ఇదే విషయాన్ని నానితో చెప్పగా ఆసక్తికరంగా ఉన్నట్లుగా స్పందించాడట.

ప్రస్తుతం ‘దేవదాస్’తో బిజీగా ఉన్న నాని ఆ తర్వాత ‘96’ చిత్రాన్ని చూసి తన ఫైనల్ నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉంది. దిల్ రాజు ఖచ్చితంగా నానిని ఒప్పిస్తాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన రెండు రీమేక్ లు ఫ్లాప్ అయిన నేపథ్యంలో నాని మరోసారి రిస్క్ ను తీసుకుంటాడా అనేది చూడాలి.