వీర మరణం పొందిన సర్జికల్ స్త్రైక్స్ జవాన్

వాస్తవం ప్రతినిధి: జమ్ముకాశ్మీర్ లోని తంగ్ ధర్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు పాల్పడడం తో భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక జవాన్ వీర మరణం పొందారు. ఐతే ఆ జవాన్ గతంలో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌లో పాల్గొన్న జవాన్ గా భద్రతా అధికారులు తెలుపారు. లాన్స్‌ నాయక్‌ సందీప్‌ సింగ్‌ అనే జవానును ఉగ్రవాదులు చంపేశారని,ఆయన వీర మరణం పొందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌లో సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో బుల్లెట్‌ గాయాలైన సందీప్‌ సింగ్‌కు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి హుటాహుటిన 92 బేస్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని, తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారని కల్నల్‌ రాజేశ్‌ కలియా వెల్లడించారు. ఈరోజు భారత సైన్యం సందీప్‌ సింగ్‌కు నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్మీ ప్రముఖులు పాల్గొన్నారు. 2016 సెప్టెంబరులో భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల్లో సందీప్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. 30ఏళ్ల సందీప్‌ సింగ్‌ 2007లో ఆర్మీలో చేరారు. ఆయన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా కోట్లా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. సందీప్‌ సింగ్‌కు భార్య ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించారు. పూర్తి మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.