ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం .. కీలక ఆధారాలు లభ్యం

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో మావోలు ఇద్దరు ప్రజాప్రతినిధులను మట్టుబెట్టిన నేపధ్యంలో ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని మావోల ప్రాబల్యమున్న అటవీ ప్రాంతంలో నిర్వహించిన కూంబింగ్ లో పెనుముప్పే బయటపడింది. పోలీసులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా మావోయిస్టులు పెట్టిన మందుపాతరలు(పైపు బాంబులు) ను పోలీసులు కనుగొన్నారు. ఈ కూంబింగ్ లో ఏడుగురు మావోలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరనుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన ప్రదేశం నుంచి పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. సోమవారం ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం స్కెచ్‌లు గీసి ఆధారాలు సేకరించింది. మొదటి స్కెచ్‌లో సర్వేశ్వరరావు హత్య తీరును పరిశీలించిన క్లూస్ టీం గడ్డిపై పడి ఉన్న రక్తపు మరకలను సేకరించారు. అలాగే, ఎమ్మెల్యేను ఎంతదూరం నుంచి కాల్చి ఉంటారన్న దానిపై ఓ అంచనాకు వచ్చారు.

ఇక రెండో స్కెచ్‌లో మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహం పడిన ప్రాంతం నుంచి రక్తపు మరకలతో పడి ఉన్న రెండు చెంప పిన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఈ చెంప పిన్నుల్లో మావోయిస్టుల తలవెంట్రుకలు వాటికి ఉన్నాయేమో పరిశీలించారు. బహుశా పెనుగులాట వల్లే పిన్నులు కింద పడి ఉండచ్చని క్లూస్ టీం అనుమానిస్తోంది. అలాగే, అతడిని కాల్చినప్పుడు ఓ బుల్లెట్ రోడ్డును గట్టిగా తాకడంతో అక్కడ చిన్న రంధ్రం పడింది. అందులో ఉన్న ఎండిన రక్తాన్ని సేకరించారు.