నాన్న వ్యక్తిత్వానికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది : కవిత

వాస్తవం ప్రతినిధి: తన తండ్రి కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఆయన మంచితనానికి, రాజనీతజ్ఞతకు, వ్యక్తిత్వానికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని ఆమె తెలిపారు. కేసీఆర్ గొప్పతనం గురించి కవిత వివరిస్తూ.. ఎవరైనా రాష్ట్రానికి సీఎంగా ఉంటే ఆయన అధికారాలు.. పాలన గురించి మాట్లాడుకుంటారని.. కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా తన ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయన్నారు. ఆయన రాజకీయాల కోసం కాకుండా భవిష్యత్తు తరాల కోసం తపిస్తారన్నారు.

వ్యక్తిత్వాలు అనేవి ముఖ్యమంత్రి పదవి రాగానే మారిపోయేవి కాదని ఆమె తెలిపారు. పనితీరు, మాట్లాడే స్టైల్, సింప్లిసిటీలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారో సీఎం అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఎవరినీ కలవరు అనే మాటలు అనవసర ఆరోపణలు మాత్రమేనని చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండదని కవిత అన్నారు. తెలంగాణలో టీడీపీ లేదని… ఇద్దరు, ముగ్గురు నేతలు మినహా మిగిలిన నాయకులు, కార్యకర్తలంతా టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా ఔట్ డేటెడ్ నేతలేనని, ప్రజాభిమానం కలిగిన వారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులకు ఉన్న ఓట్లు చాలా తక్కువని… టీజేఎస్ కు నేతలు, కార్యకర్తలు కూడా లేరని చెప్పారు.