బెయిలు మీద విడుదలయిన జగ్గారెడ్డి

వాస్తవం ప్రతినిధి: చంచల్ గూడ జైలు నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం విడుదలయ్యారు. మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్టయిన ఆయన్ని చంచల్ గూడ జైలుకు పంపిన విషయం తెలిసిందే. సికింద్రాబాదు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

అనంతరం, గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ,తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పద్నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడారని ఆయన మండిపడ్డారు. అసలు, ఈ కేసులో తన పేరు లేదని, ఈ తప్పుడు కేసు నుంచి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకులను ఇబ్బందిపాలు చేస్తున్నారని, కేసీఆర్ ని ఎవరు ప్రశ్నించొద్దనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ జీవితంలో ఏ తప్పూ చేయలేదా? కేసీఆర్ పై ఎలాంటి ఆరోపణలు లేవా? మీ నాయకులందరిపైనా ఆరోపణలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీ ఇబ్బందిపెట్టడం మంచి సంప్రదాయం కాదని కేసీఆర్ కుటుంబానికి తెలియజేస్తున్నాను. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులతో, అరెస్టులతో నాయకులను భయభ్రాంతులను చేసి ఇబ్బందిపెట్టకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వానికి తెలియజేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.