బాబు మెడకు చుట్టుకుంటున్న మరో కేసు

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – ఆయన కుమారుడు – పంచాయతీరాజ్ – ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడబెట్టిన అక్రమాస్తులపై సీబీఐ – ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వివరాలప్రకారం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మరియు వేమూరి రవికుమార్ లు ఐటీ శాఖలో దొంగ ఎంఓయూ ల పేరుతో డొల్ల కంపెనీ లకు అనుమతులిచ్చి 25 వేల కోట్ల అవినీతికి పాల్పడి, వారి వ్యక్తిగత ఆస్తులు అమాంతంగా పెంచుకున్నారని ఈ అక్రమ ఆస్తులపై సిబిఐ మరియు ఈడీ లతో విచారణ జరిపించాలని ముందడుగు ప్రజా పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు మాజీ న్యాయమూర్తి జె.శ్రవణ్ కుమార్ గారు అత్యున్నత న్యాయస్థానం లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యన్ని హైకోర్ట్ విచారణకు స్వీకరించింది.
చంద్రబాబు – లోకేశ్ – రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఐటీ పాలసీని రూపొందించి ప్రజలను – ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని జె.శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఏపీఎన్ ఆర్ టీ ద్వారా వచ్చిన ఫైళ్లను సత్వరమే క్లియర్ అయ్యేలా చట్టంలో మార్పులు చేసి ఎన్నో కంపెనీలను ఆకర్షించేలా చేసి మోసానికి తెర తీశారన్నారు. విశాఖలో ఎకరం రూ.15 కోట్ల విలువైన భూమిని రూ.3.5 లక్షలకే ఇచ్చారని.. అలా మొత్తం రూ.500 కోట్ల విలువైన 40 ఎకరాల్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇన్నోవా సొల్యూషన్స్ కు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. ఇంత ఖరీదైన భూమి ఇచ్చేందుకు విధించిన షరతులు విస్తుపోయేలా ఉన్నాయన్నారు. రెండున్నర వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీపై ప్రభుత్వ అజమాయిషీ ఏమీ ఉండదని – భూమిని అమ్ముకునేందుకు కూడా ఆ కంపెనీకి అధికారం వచ్చేస్తుందని.. ఇలాంటి షరతుతో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నారా చంద్రబాబు – లోకేశ్ బాబులు అప్పనంగా ఇచ్చేశారని పిల్ లో ఆరోపించారు.
ఈ పిల్ పై మంగళవారం చీఫ్ జస్టిస్ కోర్ట్ లో విచారణ జరగనున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం … ప్రభుత్వ అవినీతిపై మాజీన్యాయమూర్తి స్వయంగా తన వాదనలు వినిపించబోతుండటం పట్ల ఈ కేసు విషయంలో సర్వత్రా ఆశక్తి నెలకొంది. విచారణ తేది 25.09.18. కేస్ నెంబర్ 273/2018 .