రాఫెల్ డీల్ పై మరోసారి విమర్శలు చేసిన రాహుల్

వాస్తవం ప్రతినిధి: రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ని టార్గెట్ చేస్తూ మరిన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ పై మరింత ఉచ్చు బిగించి ఆయనను డిఫెన్స్ లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందిస్తూ.. మోదీని హేళన చేసే ప్రయత్నం రాహుల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వింతగా ప్రవర్తించారు. ఇప్పటికే 45 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ సంస్థకు రాఫెల్ డీల్‌ను ఎందుకు అప్పగించారని తాను ప్రధానిని ప్రశ్నిస్తే.. ఆయన కనీసం తన కళ్లలోకి కూడా చూడలేకపోయారని రాహుల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దిక్కులు ఎలా చూశారో రాహుల్ చేసి చూపించారు. ఓసారి పైకి చూశారు.. ఓసారి పక్కకు చూశారు.. ఓసారి కిందికి చూశారు.. అంటూ రాహుల్ చెప్పారు. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.