మాల్దీవుల అధ్యక్షుడిగా సొలిహ్ ఎన్నిక

వాస్తవం ప్రతినిధి: మాల్దీవుల అధ్యక్షునిగా ప్రతిపక్ష నేత ఇబ్రహీం మొహమెద్‌ సోలిహ్‌ (ఇబు) ఎన్నికయినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌పై 16.7 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మాల్దీవియన్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన ఆయన 1,34,616 ఓట్లు సంపాదించారు. ‘ఇవి ఆనందించే క్షణాలు, ఆశలు పెట్టుకొనే సమయం’ అని ఈ సందర్భంగా సోలిహ్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కార్యకర్తలు పసుపు జెండాలు పట్టుకొని వీధుల్లో విజయోత్సవం జరుపుకొన్నారు. ఓటమిని అంగీకరిస్తున్నానని, సజావుగా అధికార బదలాయింపు జరిగేందుకు సహకరిస్తానని ప్రస్తుత అధ్యక్షుడు యమీన్‌ ప్రకటించారు. ఆయన అయిదేళ్ల పదవీ కాలం నవంబర్‌ 17న ముగియనుండడంతో అనంతరమే సోలిహ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది.

సోలిహ్‌ విజయంతో ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనాకు పెద్ద దెబ్బ తగలనుందని పరిశీలకులు భావిస్తున్నారు.