అప్పుడు చరిత్ర సృష్టించిన ఆ సిక్కు వ్యక్తి ….ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు!

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్‌లో రాణి ఎలిజబెత్‌-2 పుట్టిన రోజు సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొనిన తొలి సిక్కు సైనికుడు చరణ్ ప్రీత్ సింగ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు చరిత్ర  సృష్టించిన ఆ వ్యక్తి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే…….. ఈ ఏడాది జూన్‌లో సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ట్రూపింగ్‌ ద కలర్‌ పరేడ్‌లో 22ఏళ్ల చరణ్‌ప్రీత్‌ సింగ్‌ మామూలుగా సైనికులు ధరించే టోపీకి బదులుగా తమ సంప్రదాయ తలపాగాను ధరించి వార్తల్లో నిలిచాడు. తొలిసారిగా ఇలా పరేడ్‌లో పాల్గొనడంపై ప్రపంచవ్యాప్తంగా అతడి ఫొటో వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. అయితే అతడు ఇప్పుడు అధికారులు నిర్వహించిన డ్రగ్‌ పరీక్షలో విఫలమైనట్లు తెలుస్తుంది. అతడికి తాజాగా డ్రగ్ పరీక్షలు నిర్వహించగా అతడు కొకైన్‌ తీసుకున్నట్లు బయటపడిందని, అతడిని ఆర్మీ నుంచి తొలగించనున్నారని మీడియాలో వార్తా కధనాలు ప్రచురితమౌతున్నాయి.  గత వారం నిర్వహించిన డ్రగ్స్‌ పరీక్షల్లో చరణ్‌సింగ్‌ విఫలమయ్యాడని, అధిక మోతాదులో కొకైన్‌ తీసుకున్నట్లు తెలిసిందని సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందినట్లు ది సన్‌ అనే పత్రిక వెల్లడించింది. అంతేకాకుండా అతడు డ్రగ్స్‌ గురించి బహిరంగంగా మాట్లాడేవాడని తెలిసిందని పత్రిక పేర్కొంది. చరణ్‌సింగ్‌ రాజభవనంలో విధులు నిర్వర్తిస్తూ ఇలా ప్రవర్తించడం అవమానకరమని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఆ పత్రిక వెల్లడించింది. అయితే అతడిని తొలగించే అంశంపై కమాండింగ్‌ అధికారి నిర్ణయం తీసుకుంటారని, సాధారణంగా ‘ఏ’ క్లాస్‌ డ్రగ్స్‌ తీసుకుంటే సైన్యం నుంచి తొలగించే అవకాశం ఉంటుందని పత్రిక పేర్కొంది.