వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ మునిరత్నంరెడ్డి, ఎఇఓ శ్రీసుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీమతి మల్లీశ్వరి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.