ఆంక్షలు విధించిందిన కారణంగా సైనిక చర్చలను రద్దు చేసుకున్నచైనా

వాస్తవం ప్రతినిధి: రష్యా నుండి సైనిక పరికరాల కొనుగోళ్ల నేపధ్యంలో చైనా పై ఆంక్షలు విధించింది అమెరికా. దీనికి నిరసనగా ఆ దేశంతో చైనా తన సైనిక చర్చలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. రష్యా నుంచి క్షిపణులు, ఇతర పోరాట విమానాలను చైనా కొనుగోలు చేయడం రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య జరిగే మామూలు వ్యవహారమని, దీనిలో మీ జోక్యం చేసుకునే అధికారం అమెరికాకు లేదని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు కియాన్‌ చెప్పారు. చైనా విదేశాంగశాఖ బీజింగ్‌లోని అమెరికా రాయబారిని పిలిపించుకుని అమెరికా వ్యవహార తీరుపై తన తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. అంతేకాదు, అమెరికాతో జరగాల్సిన సైనిక చర్చలను రద్దు చేయాలన్న తన నిర్ణయాన్ని ఆయనకు తెలిపింది. అమెరికా సైనికాధికారులతో చర్చలు జరిపేందుకు వచ్చే వారం అమెరికా వెళ్లనున్న నౌకాదళాధిపతి షెన్‌జిన్‌లాంగ్‌ పర్యటనను రద్దు చేసినట్లు చైనా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ అంశానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకునే హక్కు కూడా తమకున్నదని చైనా స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.