ఇరాన్ ప్రభుత్వం కూలడం ఖాయం: రూడీ గిలియాని

వాస్తవం ప్రతినిధి: ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయం ఖాయం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గిలియాని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై తాము విధించిన ఆంక్షలతో అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం చెలరేగి అక్కడి ప్రభుత్వ ఉద్వాసనకు దారి తీస్తుందని గిలియానీ చెప్పారు. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడం తమ విధానం కాదని ట్రంప్‌ సర్కారు ప్రకటించిన దానికి భిన్నంగా గిలియానీ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘ఎప్పుడన్న సమయం చెప్పలేను కానీ ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూలదోయడం ఖాయం’ అని అంటూ గిలియాని వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగింది. ఇరాన్‌ ప్రభుత్వ వ్యతిరేక సంస్థ ఆర్గనైజేషన్‌ ఆఫ ఇరానియన్‌-అమెరికన్‌ కమ్యూనిటీస్‌ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు బేషరతుగా చర్చలకు రావాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనను ఇరాన్‌ అధినేత ఆయతుల్లా ఆలీ ఖొమేనీ గత వారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిలానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొద్ది రోజులు లేదా నెలలు లేదా రెండు సంవత్సరాలలోపే ఇరాన్‌ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమన్నారు. ‘ఇరాన్‌ ప్రజలు ఇప్పుడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆంక్షలు అమలులోకి రావటంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కరెన్సీ విలువ నానాటికీ పతనమవుతోంది. ఇవి ఇరాన్‌లో సంపూర్ణ విప్లవానికి భూమిక కల్పిస్తాయి. ఈ విప్లవం విజయం సాధించటం ఖాయం’ అని గిలియానీ అన్నారు.