భారత్-ఆఫ్ఘన్ మధ్య వాణిజ్య అభివృద్ధి కి ఇరాన్ బాసట!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం భారత్‌-ఆఫ్ఘన్‌ల మధ్య పాకిస్తాన్‌ భూభాగం మీదుగా కొనసాగుతున్న వాణిజ్యం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా తమ దేశం ద్వారా ఈ కార్యకలాపాలు కొనసాగించాలని ఇరాన్‌ తాజాగా సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్‌ నుండి భారత్‌కు ఎగుమతులను పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరిస్తున్నప్పటికీ పాక్‌ భూభాగం ద్వారా ఆఫ్ఘన్‌కు ఎగుమతులు సాగించడానికి మాత్రం భారత్‌ను అనుమతిచటం లేదు. తమ భూభాగం ద్వారా ఆఫ్ఘన్‌తో వాణిజ్యం కొనసాగించేందుకు భారత్‌ను అనుమతించేందుకు ముందు ఇందుకు సంబంధించిన సాంకేతిక, వ్యూహాత్మక సమస్యలకు పరిష్కారం చూపాలని పాక్‌ స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్‌ తమ భూభాగాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు వీలుగా మూడు దేశాల మధ్య ట్రాన్సిట్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్‌లో భారత్‌ కూడా భాగస్వామి కావాలని ఆఫ్ఘన్‌ కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌ మాత్రమే భారత్‌ -ఆఫ్ఘన్‌ల మధ్య వాణిజ్యాభివృద్ధికి తన దేశంలోని చబహార్‌ రేపు ద్వారా సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గం చూపుతోంది. 50 కోట్ల డాలర్ల వ్యయంతో కూడిన ఈ చబహర్‌ ఓడ రేవు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు భారత్‌ ఇరాన్‌లో ఒక ఒప్పందాన్ని ఇప్పటికే కుదుర్చుకుంది.