టీ 20 ప్రపంచ కప్ కు సరిగ్గా 11 ఏళ్లు

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ చరిత్రలో 1983కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆ ఏడాది టీమిండియా కపిల్‌ దేవ్‌ నేతృత్వంలో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం తరువాత భారత్ కు మరో ప్రపంచ కప్ రావడానికి 24 ఏళ్ల సమయం పట్టింది. 2007 సెప్టెంబర్ 24 న మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వంలో  టీ20 లో తొలి ప్రపంచకప్‌ను గెలుచుకొని తన సత్తాను ప్రపంచానికి భారత్‌ మరోసారి చాటింది. దాయాది పాకిస్థాన్‌ను ఓడించి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకుని నేటికి సరిగ్గా 11 ఏళ్లు. ఈ సందర్భంగా పలువురు క్రికెట్‌ అభిమానులు ఆనాటి విజయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫెవరెటేమీ కాదు. సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ ధోనీ టీమిండియాను ముందుండి నడిపించాడు. అలాగే టీ20ల్లో ఆడిన అనుభవం కూడా భారత్‌కు పెద్దగా లేదు. అంతకుముందు ఏడాది క్రితం దక్షిణాఫ్రికాతో భారత్‌ ఒక మ్యాచ్‌ ఆడింది. అయితే అద్భుత ప్రదర్శనతో ధోనీ సేన ఈ టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడి ప్రపంచ కప్ ని గెలుచుకుంది. సరిగ్గా ఆ విజయానికి 11 ఏళ్లు పూర్తి కావడం తో ఇప్పుడు ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.