సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

వాస్తవం ప్రతినిధి: సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33కిలోమీటర్ల దూరంలో పోక్యంగ్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న 2 కిలోమీటర్ల ఎత్తైన పర్వతంపై దీన్ని నిర్మించారు. భారత్‌-చైనా సరిహద్దుకు దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. అనేక సంక్లిష్టతల నడుమ పర్వత శిఖరాలను తొలిచి ఈ విమానాశ్రయ నిర్మాణం చేశారు. దీనిని నిర్మించడానికి తొమ్మిదేళ్లు పట్టింది. రూ. 605 కోట్ల ఖర్చుతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో 201 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఉంది. అక్టోబర్ 4వ తేదీన ఇక్కడి నుంచి ఢిల్లీ, కోల్ కతా, గౌహతిలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాలయ రాష్ట్రమైన సిక్కింలోని ప్రకృతి సోయగాలకు ముగ్ధుడయ్యారు. స్వయంగా అక్కడి అందాలను తన ఫోన్‌తో ఫొటోలు తీశారు. వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. సిక్కింలోని పాక్యాంగ్‌లో ఈరోజు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆదివారం సాయంత్రమే మోదీ ఆయన అక్కడికి చేరుకున్నారు. అయితే మోదీ సిక్కింలోని అందమైన పర్వత శ్రేణులను, ప్రకృతి అందాలను తన ఫోన్‌ కెమెరాతో బంధించారు. రాష్ట్రం ఎంతో నిర్మలమైనదని, అద్భుతంగా ఉందని అన్నారు. ఆ ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. భారత పర్యాటక రంగం కోసం ఈ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తున్నారు.