అమీర్ పేట – ఎల్బీ నగర్ మెట్రో మార్గం ప్రారంభించిన నరసింహన్, కేటీఆర్

వాస్తవం ప్రతినిధి: అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 16 కి.మీ. మార్గాన్ని గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అమీర్ పేట్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, మెట్రో అధికారులు హజరయ్యారు. అనంతరం గవర్నర్‌తో కలిసి వీరంతా మెట్రోలో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ప్రయాణించారు.మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కు మెట్రో రైలు 52 నిమిషాల్లోనే ప్రయాణిస్తుందని అధికారులు ఈ సందర్బంగా వెల్లడించారు. ఈ రూట్ లో 18 రైళ్లు తిరుగుతూ ఉంటాయని, ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకూ ఓ రైలును అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.

మరోవైపు ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అక్కడి నుంచి మియాపూర్ దాకా 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలందుతున్నాయి. రోజూ సగటున 75 వేల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు 16 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వస్తుండటంతో నగరంలో మెట్రో ప్రయాణం మొత్తం 46 కిలోమీటర్లకు విస్తరించనుంది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత అతి పొడవైన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డు నెలకొల్పనుంది. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా, తర్వాత స్థానంలో చెన్నై 35.3 కి.మీ. దూరం సేవలందిస్తున్నది. నేటి నుంచి చెన్నైని వెనక్కి నెట్టి హైదరాబాద్ మెట్రోరైల్ ఆ స్థానానికి చేరుకోనుంది. ఇక అతి త్వరలోనే మూడో కారిడార్‌లో మిగిలిన 8.5 కిలోమీటర్ల మేర గల అమీర్‌పేట- శిల్పారామం మార్గాన్ని సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.