మావో ల దుశ్చర్యలను ఖండిస్తూ మన్యం బంద్ కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు

వాస్తవం ప్రతినిధి: విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. మావోయిస్టుల దుశ్చర్యలను ఖండిస్తూ గిరిజన సంఘాలు మన్యం బంద్ కు పిలుపునిచ్చాయి.ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో నేడు, రేపు.. రెండ్రోజుల పాటు బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి
దీంతో అరకు, పాడేరు, డుంబ్రిగూడ వెళ్లే ఆర్టీసీ సర్వీసులను రద్దుచేశారు. వ్యాపార సంస్థలు కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. మరోవైపు అరకులో సివేరి సోమ అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలాన్ని కేటాయించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఐదెకరాల భూమి కేటాయించి, ఇందులోనే ఆయన స్మారకచిహ్నం ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.

విశాఖ ఏజెన్సీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ బలగాలను రంగంలోకి దింపారు. నిన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు హత్య చేయడంతో ఆవేశంతో ప్రజలు రెండు పోలీస్ స్టేషన్లపై దాడికి దిగారు. స్టేషన్ లోని ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, డీఐజీ శ్రీకాంత్ లు సమన్వయంతో పోలీసులను రంగంలోకి దించారు. అమెరికాలో ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.