నా గురువులు పాఠాలేకాదు..విలువలను కూడా నేర్పించారు

వాస్తవం ప్రతినిధి: ‘నేను నేడు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అందుకు కారణం చిన్నతనంలో నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులే.. నెల్లూరు సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో నేర్చుకున్న పాఠాలే నన్ను ఈ విధంగా మీ అందరి ముందు నిలబెట్టాయి.. ఆ స్కూల్‌లో విద్యా బోధన చేసిన నా గురుదేవులు పాఠాలేకాకుండా విలువలను కూడా నేర్పించారు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బారాషాహిద్‌ దర్గా, రొట్టెల పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ఆయన నెల్లూరు నగరానికి చేరుకున్నారు. స్థానిక మాగుంటలేఅవుట్‌లోని డీఎస్‌ఆర్‌ గెస్ట్‌ ఇన్‌లో విడిది చేశారు.ఈ సందర్భంగా తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు, చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. వారితో ప్రత్యేక సమావేశం అయ్యారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌కు చిన్నప్పుడు చదువు నేర్పిన గుర్పులను సన్మానించారు. ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి వారందర్నీ శాలువాలతో సత్కరించారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ గురువులు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. నెల్లూరులోనే తన పాఠశాల రోజులు గడిచాయని, ఈ సందర్బంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జనసేన పార్టీ ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా చేస్తుందని అన్నారు. తమ పార్టీలోకి వచ్చే వారు తనపై అభిమానంతో రావద్దని దేశం, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌.. అభిమానులు,కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి పౌరుడు ఓటు నమోదు చేయించుకోవాలని పవన్‌ సూచించారు. తమ పార్టీలో కుల మతాలకు తావుండదని స్పష్టం చేశారు.