రాజస్థాన్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

వాస్తవం ప్రతినిధి: రాజస్తాన్ లో త్వరలో ఎన్నికల జరగనున్న ఈ సమయంలో బీజేపీ కి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటకి వచ్చినట్లు తెలుస్తుంది. మరో 2–3 నెలల్లో రాజస్థాన్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో రాజస్తాన్‌లో ఓ ఎమ్మెల్యే అధికార బీజేపీ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కొడుకు, శివ్‌ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న మాన్వేంద్ర సింగ్‌ తాను బీజేపీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన ప్రస్తుతానికైతే లేదనీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బాడ్మెర్‌–జైసల్మేర్‌ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని మాన్వేంద్ర చెప్పారు.  ఇన్నాళ్లూ బీజేపీలో కొనసాగి తాను పెద్ద తప్పు చేశానని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జశ్వంత్‌ సింగ్‌కు ఎంపీ టికెట్‌ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.