అసలు హడాడ్ నేపధ్యం ఏంటి!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా స్థానం లో అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఫెర్నాండో హడాడ్‌ పైనే సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా  పోటీకి బ్రెజిల్ సుప్రీం కోర్టు అనుమతి నిరాకరించడం తో తన ఉపాధ్యక్ష అభ్యర్ధి గా హడాడ్ ని ప్రతిపాదించారు. దీనితో అసలు హడాడ్ ఎవరు? ఏంటి అనే దానిపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఆయన న్యాయవ్యవహారాల్లో విశేష పరిజ్ఞానం వుంది. హడాడ్‌ నేపథ్యం, రాజకీయ జీవితంపై టెలిసూర్‌ శాటిలైట్‌ టివి ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. బ్రెజిల్‌లోని లెబనీస్‌ వలస కుటుంబానికి చెందిన హడాడ్‌ శావోపాలో యూనివర్శిటీలో లా చదివారు. బ్రెజిల్‌ అధ్యక్ష పదవికి స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని కోరుతూ సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1981లో లా డిగ్రీ అందుకున్న హడాడ్‌ తర్వాత ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఫిలాసఫీలో డాక్టరేట్‌ చేశారు. 2005 నుండి 2012 వరకు లూలా, దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వాల్లో విద్యా మంత్రిగా పనిచేశారు. ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఆల్‌ ప్రొగ్రామ్‌’ నెలకొల్పి తక్కువ ఆదాయం గల విద్యార్ధులకు కూడా ప్రైవేటు యూనివర్శిటీల్లో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. 14 కొత్త ప్రభుత్వ యూనివర్సిటీలను, 214 టెక్నికల్‌ స్కూళ్లను, 126 కొత్త పబ్లిక్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లను నెలకొల్పారు. 587 దూర విద్యా కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వ, మున్సిపల్‌ స్కూళ్లకు బోధనోపక రణాలను అందించడంతో సహా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రత్యేక వార్షిక ప్రణాళికలను రూపొందించారు. ఆ విధంగా విద్యారంగంపై తనదైన ముద్ర వేశారు.