అప్పుడే ట్రంప్ ని గద్దె దించేందుకు సిద్దమయ్యారట

వాస్తవం ప్రతినిధి: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రకరకాల పరిణామాలతో దినదినగండంగా గడుపుతున్న అధ్యక్షుడు ట్రంప్‌ ఎదురుగా మరో పెను సవాలు నిలిచింది. ఎప్పుడో 2017 మే నెలలో ట్రంప్‌ డిప్యూటీ అటార్నీ జనరల్‌ అయిన రాడ్‌ రొసెన్‌స్టీన్‌ ఆయనను గద్దె దించేందుకు సాక్ష్యాలతో సహా సిద్ధమైనట్లు అక్కడి మీడియా తాజాగా కధనాలు ప్రచురించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అత్యున్నతస్థాయి అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ అంత దీటైన వ్యక్తి ఏమీ కాదు సుమా! అంటూ సాక్షాత్తూ ఆయన డిప్యూటీ అటార్నీజనరలే ఒకప్పుడు గట్టిగా అభిప్రాయపడ్డారు.  అణుబాంబులాంటి ఈ వార్తను ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’, ‘ ది వాషింగ్టన్‌ పోస్ట్‌’లు తాజాగా ప్రచురించాయి.  ట్రంప్‌ అధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఉండాల్సిన  దక్షత…సామర్థ్యం…అర్హత అనేవే లేని ట్రంప్‌ను పక్కనబెట్టేందుకు ఏం చేయాలనే అంశంపై డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రొసెన్‌స్టీన్‌ తీవ్రంగా చర్చించారు. ‘శ్వేతసౌధం’లో లుకలుకలను ప్రస్ఫుటం చేసే సాక్ష్యాలను రొసెన్‌స్టీన్‌ రహస్యంగా నమోదు చేసి ఉంచినట్లు తెలుస్తోంది.