పాక్ తో మరోసారి తలపడనున్న భారత్

వాస్తవం ప్రతినిధి:  సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలిపోరులో భారత్‌ పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. హాంకాంగ్‌తో తొలిమ్యాచ్‌ మినహా ఆసియాకప్‌ టోర్నీలో భారత జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అదే ఊపును కొనసాగిస్తూ శుక్రవారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆసియాకప్‌లో భారత్‌ తర్వాత ఆశించదగ్గ ప్రదర్శన చేస్తున్న మరోజట్టు ఏదైనా ఉందంటే అది ఆఫ్ఘనిస్తాన్‌ అని చెప్పుకోవచ్చు. సంచలనాలకు మారుపేరైన ఆప్ఘన్‌ జట్టు లీగ్‌ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలవగా.. శుక్రవారం పాకిస్తాన్‌ను ముచ్చెమటలు పట్టించింది. 257 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ ఛేదించడానికి చివరి ఓవర్‌ వరకూ పోరాడాల్సి వచ్చింది. అంతేగాక ఏడు వికెట్లను కోల్పోయి ఓటమి కోరలనుండి బయట పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపు ఎవరిదీ అనేది ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు.