ముగ్గురు క్రికెటర్ల కు ఐసీసీ జరిమానా

వాస్తవం ప్రతినిధి: ముగ్గురు క్రికెటర్ల కు ఐసీసీ జరిమానా విధించినట్లు తెలుస్తుంది. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముగ్గురు క్రికెటర్లు నిబంధనలు ఉల్లఘించిన కారణంగా ముగ్గురి పై జరిమానా విధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా వేర్వేరు సందర్భాల్లో అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ అస్గర్‌.. పాకిస్థాన్‌ ఆటగాడు హసన్‌ అలీ నిబంధనలను ఉల్లంఘించారని అంపైర్లు అనిల్‌ చౌదరి, షౌన్‌ జార్జ్‌, మూడో‌ అంపైర్‌ రోడ్‌ టుకెర్‌, నాలుగో అంపైర్‌ అనిస్‌ ఉర్‌ రహ్మాన్‌ గుర్తించారు. దీంతో ముగ్గురు ఆటగాళ్ల మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. హసన్‌, అస్గర్ మైదానంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని‌.. ఆ తీరు ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.1.1 ను ఉల్లంఘించినట్లేనని ఐసీసీ పేర్కొంది. ఇక రషీద్‌ తన భాష, మైదానంలో ప్రవర్తించిన తీరుతో‌ ఆర్టికల్‌ 2.1.7 నిబంధనను ఉల్లంఘించాడని తెలిపింది. ఈ ముగ్గురు క్రికెటర్లు ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా పొందారని ఐసీసీ పేర్కొంది.