క్యాన్సర్ తో బాధపడుతున్న దిగ్గజ బ్యాట్మింటన్ క్రీడాకారుడు

వాస్తవం ప్రతినిధి: మలేసియా దిగ్గజ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు లీ చాంగ్‌ వీ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ముక్కు క్యాన్సర్‌తో బాధపడుతున్న లీ చాంగ్‌ ప్రస్తుతం తైవాన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్ ఆఫ్ మలేసియా(బీఏఎం) శనివారం వెల్లడించింది. ‘లీ చాంగ్‌ వీ ఎర్లీ స్టేజ్‌ ముక్కు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, తైవాన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు, చికిత్సతో అతడు కోలుకుంటున్నాడు,త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుని తిరిగొస్తాడు’ అని బీఏఎం అధ్యక్షుడు దతుక్‌ సెరీ నోర్జా జకారియా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జులైలో లీ చాంగ్‌కు శ్వాస సంబంధమైన సమస్య ఏర్పడింది. దీంతో ఆసుపత్రిలో సంప్రదించగా.. ముక్కు క్యాన్సర్‌ అని తేలింది. కాగా.. లీ చాంగ్‌ మూడో దశ ముక్కు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై బీఏఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ అని,త్వరలో కోలుకొని బయటకు వస్తారని తెలిపారు. ప్రపంచ మాజీ నంబర్‌ 1 బ్యాడ్మింటన్ ఆటగాడైన లీ చాంగ్‌.. ఒలింపిక్స్‌లో మూడు సార్లు రజత పతకం సాధించాడు. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియాన్‌ గేమ్స్‌కు లీ దూరమయ్యాడు.