రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోదీ మౌనం వీడాలి: జైపాల్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: రాఫెల్ ఒప్పందం ఓ భారీ కుంభకోణం అని తేలిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. అబద్ధం చెప్పి దేశ ప్రజలను మోసం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి అడుతున్న డ్రామాకు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హాలాండ్ చేసిన వ్యాఖ్యలు చెక్ పెట్టాయన్నారు. రాఫెల్ ఒప్పందం సమయంలో రిలయన్స్ కంపెనీ తమకు తెలియదని, ప్రధాని మోదీనే రిలయన్స్ పేరును సూచించారని ఫ్రాన్స్ మాజీ ప్రధాని హాలెండ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జైపాల్ రెడ్డి.. రాఫెల్ ఒప్పందంలో 36 విమానాలకు రూ.60వేల కోట్లు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కానీ యూపీఏ హయాంలో రూ.21వేల కోట్లకే ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారన జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. దొరికిపోతాననే భయంతోనే మోదీ దీనిపై స్పందించడం లేదని విమర్శించారు.