బోల్తా పడ్డ బీరు బాటిళ్లతో వస్తున్న ట్రక్కు .. వరదలా పారిన మద్యం

వాస్తవం ప్రతినిధి: రాజస్థాన్‌ రాష్ట్రంలోని కిషన్‌గఢ్‌ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద బీరు బాటిళ్లతో వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని బీరు వరదలా పారింది. బీరు సీసాలు ఎత్తుకెళ్లేందుకు స్థానికులు టోల్ ప్లాజ్ వద్దకు పరుగులు తీశారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టోల్‌ప్లాజా దెబ్బతింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.