రాజమహేంద్రవరంలో అగ్నిప్రమాదం.. బాణసంచా పేలి ముగ్గురి మృతి

వాస్తవం ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. నగరంలోని లాలా చెరువు ప్రాంతంలో ఓ ఇంట్లో ఈ రోజు  తెల్లవారుజామున బాణసంచా పేలిన ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.వివరాల ప్రకారం..
సుబ్బారావుపేటలోని పూరింట్లో నివాసముండే ముత్యాలరెడ్డి కుటుంబం బాణసంచా తయారుచేస్తుండగా విద్యుదాఘాతం కారణంగా అకస్మాత్తుగ భారీ పేలుడు సంభవించింది. వీరు ఏటా దీపావళికి బాణసంచా తయారు చేస్తుంటారు.
ఈ క్రమంలో రాత్రి టపాసులు తయారు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనా స్థలికి పోలీసులు వెళ్లి క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్యాల రెడ్డి భార్య సూర్యకాంతం, కోడలు ధనలక్ష్మి మృతి చెందారు. అనంతరం కుమారుడు వినయ్‌రెడ్డి కూడా చనిపోయాడు. ముత్యాల రెడ్డి, అతని మేనకోడలు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.